మన హైదరాబాదు

 

ఏ దిక్కు వారైనా ఏ దిక్కు లేకున్నా
అక్కున చేర్చుకొని ఆకలి తీర్చే
అవకాశాల అక్షయపాత్ర
భాగ్యమొసగే మన భాగ్యనగరం!

——

ఆకాశం మొగులేసే 

ఆగకుండా వాన కురిసే

సడకులన్నీ సంద్రమాయే

వాహనాలూ నత్త నడకే

కాస్త పయణమూ గగనమాయే!

——


అక్రమార్కులు చెరువులని ఆక్రమించే

బహుళ అంతస్తులు బాగుగా నిర్మించే

దిక్కు తోచని వరద దారులెంట పారే

భాగ్య నగర వాసుల భాగ్యమేమందుమో!

——-


ఆ దొర పోయి ఈ దొర వచ్చే ఢాం ఢాం ఢాం

మాస్టర్ ప్లాను మారి పోయే ఢాం ఢాం ఢాం

భాగ్యం కోసం భాగ్య నగరాన ఢాం ఢాం ఢాం

పాట్లుబడి ప్లాట్లు కొన్నవారు ఢాం ఢాం ఢాం

ధగా పడెను దొరల పంతానికి ఢాం ఢాం ఢాం!

——


చుట్టుముట్టూ చూపు తిప్పుకోలేని ఆకాశహర్మ్యాలు

నట్టనడుమ పంచ శతాబ్ధాల కట్టడాలు

కొత్త పోకడల నడుమ పదిలముగ పాత జ్ఞాపకాలు 

విభిన్న మతాల వివిధ రాష్ట్ర వాసుల సంగమం

నిజమైన భారతీయం మన హైదరాబాదు!

————-


అటు చూస్తే ఆకాశ హర్మ్యాలు

ఇటు చూస్తే ఇరుకైన బస్తీలు

అబ్బుర పరిచే నెక్లెస్ దారులు

ఆదమరిస్తే కబళించే నాళాలు

భాగ్య నగరం భిన్నత్వాల ఏకత్వం!


————

కిక్కు కిక్కంటూ కుర్రకారు వెర్రివేషాలు

నరనరానా పారించె మాదకద్రవ్యాల జోరు

ముత్యాల నగరంపై మత్తు మరకలు 

మసకబారుస్తుండె మునపటి చరితను!

———-

వారెవ్వాభాగ్యనగరం

ఎచ్చులకే విశ్వనగరం!

వొచ్చిందా మోస్తారు వర్షం

అయిపోవు దారులేరులే!

నాలాలు పొంగిపోవు

ట్రాఫిక్కు ఆగిపోవు!

వారెవ్వాభాగ్యనగరం

ఎచ్చులకే విశ్వనగరం!

———


బిజీబిజీ పరుగుల గజిబిజి పయనం

నగర జీవితం నరక ప్రాయం!

చిల్లు పడినదా మబ్బులకు

చుక్కలు కనపడు మనుషులకు!

——


చెరువులు నాళాలు చెరపట్టి బకాసురులు

అమాత్యుల అండన అడ్డగోలు కట్టడాలు

చిల్లు పెట్టుకొని ఆకాశం చూపించే తన కోపం

నడి రోడ్డు సంద్రమాయే నడుంలోతు నీటితో

మేడమిద్దెలున్నంతనే మేటి నగరమనలేము

భాగ్యనగర వాసుల భాగ్యమెప్పుడు మారునో!

——-


భాగ్యనగర పశ్చిమాన భడా బాబుల పెట్టుబడులు

కోట్లు పలికే సెంటు భూమి కోకాపేటా కొండ గుట్టలు

అన్ని దిక్కుల అదే తీరు అడ్డు అదుపులేని ధరలు

కలగా మారే సొంత ఇల్లు కలవరపెట్టే ఇంటి అద్దెలు!

——-


మన రాష్ట్ర మణిపూస మన హైదరాబాదు

మునుపటి చరిత్రకు రేపటి భవితకు వారధి

పట్నం పోతే పని దొరుకునన్న నమ్మకాన్ని 

ఒమ్ము చేయని మన అక్షయపాత్ర

మారుతున్న కాలానికి మార్పు చేసుకుంటూ

అవకాశాల కల్పనలో అగ్ర తాంబూలం 

ఆసరా కోసం ఎక్కడివారొచ్చినా అక్కున చేర్చుకుని

భాగ్యరేఖలు బాగుగా దిద్దు భాగ్యనగరం!

———

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కలగూర గంప

వేషభాషలందు తెలుగు లెస్స!