కలగూర గంప
——
——
——
——
——
తప్పెవరిది?
——
——
నీకన్నా తోపెవ్వడూ నీ గూర్చి తెలువంగ
నీ తెలివి నీ తెగువ నీడలా నీ తోడు!
పరుల వెక్కిరింతలు పట్టించుకోకుండా
అడుగేయి ముందుకు అనుకున్నది సాధించ!
——
పై వాడు ఆటవిడుపుకై
రాసుకుంటాడు కథలెన్నో!
పాత్రలకు ప్రాణం పోసి
రక్తి కట్టిస్తాడు జగన్నాటకాన్ని!
అల్లిన కథలో పాత్రలం
ఆడించే ఆటలో పావులం!
తెలుసుకుంటే కనువిప్పు
తెలియకుంటే తలపోటు!
——
ఊరిస్తున్న కప్పును ఒడిసి పట్టాలన్న కసి
రాటు తేల్చింది రాహుల్-రోహిత్ సేనని!
చివరి సారిగా మురిపించిన కొహ్లీ బ్యాటింగ్
ఆసాంతం నిప్పులు చెరిగిన బుమ్రా బౌలింగ్
తన విలువేంటో చెప్పకనే చూపిన హార్ధిక్
అదరహో అనిపించిన అధినాయక రోహిత్!
నభూతో అన్నట్టు సూర్య కుమారుడి క్యాచ్
ఒడ్డుకు చేర్చెను ఓటమి అంచుల నుంచి!
——
కొన ఊపిరితో కొట్టుకుంటున్న ప్రాణం
అడ్డం జరగండని అరుస్తున్న అంబులెన్సు
దారి వదలకుండా దౌడు తీస్తున్న వాహనాలు
ఆగలేమా అర క్షణం ఆయువు నిలిపేందుకు?
——
అంగారకుడిని చేర అడుగులు పడుతుంటే
గోత్ర నామాల గొడవేంది మామా!
అందరు మెచ్చిన కలాం గారిదే మతం ఏ గోత్రం!
మణిపూర్ మహిళల మానం హరించిన మృగాలదే మతం ఏ గోత్రం!
గోత్రంలో లేదు గొప్పతనం మతంలో లేదు మంచితనం!
——
అవసరాల కోసం అవార్డులతో గాలం
అభాసు పాలాయే అత్యున్నత పురస్కారం!
అర్హులైన వారికే అందించిన కానీ
అర్హతను దిగజార్చే అందించిన సందర్భం!
——
అంతరిక్ష విజయాలు ఆరని కొలిమి మంటలు
ప్రకృతి వైపరీత్యాలు కృత్రిమ మేథ ప్రకంపనలు
కాల గర్భంలో కలిసి పోయే మరో సంవత్సరం
చరిత్ర పుటల్లో చేరి పోయే తన జ్ఞాపకం!
——
అక్షరాలు తెలిసినవే, పదాలు తెలిసినవే
అయిననూ, పద వరుసల పట్టు చిక్కట్లేదే
ఊహలకు రూపమివ్వ
జక్కన్న శిల్పంలా, రవివర్మ చిత్రంలా!
నేల నాటిన విత్తుకు ప్రాణమివ్వ
నింగి రాలిన నీటి చుక్కలా
నా ఊహలకు పద ఊపిర్లూద
నా దరి చేరవా స్పూర్తి జల్లులు!
——
నిల్చున్నా నేను నాలుగు కూడళ్ళ నడుమన
పడకుందీ మలి అడుగు పయనమెటో తెల్వక
సోయి తప్పింది మది సోచాయించలేక
ఎదురు చూస్తున్నా కాలానికై దారి చూపించగా!
——
పైస మీద పేదోడి పాట
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నేనే ఉన్నా కూడా లేనిది నీవే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉంటూ నా దరికి రావే
నీ దెగ్గరొస్తే తరిమేస్తావే నాలోకమంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
అధర్మ పక్షాన అన్నదమ్ములునూరైనా
ఉపయోగమేల ఉప్పునీటివోలె!
ధర్మనిరతి తోడ ఒక్కడైనను చాలు
ప్రపంచానికి మూడినట్టే పద్దతి మారకుంటే!
——
నీ రూపు మధురం నీ రుచి మధురం
నీవుండ నా ఇంట నా వంట పండే
పప్పు చేసిన కానీ పచ్చడైనను కానీ
కూర వండిన కానీ చారు చేసిన కానీ
సలాడులో నీవే సాండ్విచ్చులో నీవే
అగ్రతాంబూలంబు అన్ని కాయగూరల్లో!
ఆహా అంటున్నామని అలుసై పోతిమా
దరి చేరలేనంత ధర లెందుకమ్మా
బెట్టు వదిలి మా బుట్టలో చెరమ్మా
కమ్మనీ వంటయై కంచంలో రావమ్మా
మాయమ్మ టమాట మమ్ము కరుణించమ్మా!
———
నీకన్నా తోపెవ్వడూ నీ గూర్చి తెలువంగ
నీ తెలివి నీ తెగువ నీడలా నీ తోడు!
పరుల వెక్కిరింతలు పట్టించుకోకుండా
అడుగేయి ముందుకు అనుకున్నది సాధించ!
———
ఎటువైపు చూసిన ఎర్రటి మట్టి నేలలు
కక్షలు తెంచిన కుత్తుకల రక్తపు గుర్తులా?
కనుచూపు మేర కనిపించని చెట్టు చేమ
తొలకరి జల్లుకు తడారిన పుడమి చూపు!
——-
తెరిచిన రెప్ప మూసే వరకు
జీవితమంతా జగన్నాటకం!
బంధాలంటూ భాద్యతలంటూ
పలు పలు పాత్రల పోషణలో
రంగమార్తాండులం రంగస్థలాన!
———
దురాక్రమణల దౌర్జన్యం
దడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం
అలుముకుంటున్న ఆర్ధిక మాంద్యం
పురుడు పోసుకునే ప్రపంచం
పురిటి నొప్పులతో కొత్త సంవత్సరం!
——-
కాలగర్భంలో కరిగిపోయింది
ఎప్పటిలానే మరో ఏడాది!
చేదూ తీపీ కలగలుపుగా
చెరెను మదిలో జ్ఞాపకంగా!
——
ఏ శిల్పి కన్నాడో ఈ శిలను
అమరుడాయెను తన కళతో!
శిరస్సులు తెంచే ఉన్మాదం
పొందదెప్పుడూ అమరత్వం!
——
రాళ్ళ దిబ్బలు కావవి రత్నాల రాశుల గాధ
రాజసం నిండిన రాయల ఉత్కృష్ట పాలన
అసమాన కవితాపాటవాల అష్ట దిగ్గజాలు!
———
మిడిమిడి జ్ఞానపు మూర్ఖపు వెధవలు
భావ స్వేచ్ఛయంటు బలుపు మాటలు
పరుల మనోభావాలు పట్టని శుంఠలు
పబ్లిసిటీకై పాకులాటలు!
——-
నాలో ఏదో తెలియని వెలితి
నాలో నాకే కలిగెను అలజడి
నలుగురి నడుమ ఉన్నను కూడా
నాలో నేను లేనని పించే!
నేనిక్కడే నా మనసెక్కడో
నా తోడు లేదు నే ఊసులాడ
నన్ను నన్నుగా చూడని వారితో
నలిగి పోయే నాలోని హృదయం!
నాలోని కలలు కల్లలైపోగా
నాకై నేను బ్రతకలే ఏనాడు
నిన్నటి నేను కలగా మిగలగ
నాకు కలుగునా రేపటి ఉదయం!
——
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి