ఎంత కష్టం ఎంత కష్టం!

 

కూటి కోసం కూలి కోసం

కన్న వారిని వదలిపెట్టి

కన్న ఊరిని విడిచిపెట్టి

బయట రాష్ట్రం వెళ్ళిపోయిన

బతికి చచ్చిన బీదవాడా

ఎంత కష్టం ఎంత కష్టం!


నలుగురున్న ఇంటిలోన

నాలుగు పైసలు కూడబెట్ట

రెండు పూటల కూడుపెట్ట

రేయి పగలు కష్టపడుతూ

చచ్చి బతికిన చిన్నవాడా

ఎంత కష్టం ఎంత కష్టం!


మాయదారీ కరోనాతో

మారిపోయిన జీవనంలో

పగలు రేయి పనుల్లేక

తినాలంటే తిండిలేక

పస్తులుండిన పేదవాడా

ఎంత కష్టం ఎంత కష్టం!


కన్న ఊరిలో కన్న వారితో

కలో గంజో తాగుదామని

కట్టుబట్టన కుటుంబంతో

బయలుదేరే కాలి నడకన

బతుకు పోరున ఓడినోడా

ఎంత కష్టం ఎంత కష్టం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు