మా పల్లె రోదన చూడు

 

మా ఊరు పల్లెటూరు

మా పల్లె పిలిచెను నేడు!


పైరు పంట సోయగాలు

పిల్ల గాలి చక్కిలిగింతలు

తరతరాల అనుబంధాలు

తరిగిపోని జ్ఞాపకాలు

ఊహల ఉయ్యాలలూగ

ఊసులెన్నో చెప్పుటకని

వేగిరమే రెక్కలు కట్టి

వేకువనే చేరుకుంటిని!


కలలన్నీ కల్లలు కాగా

కటిక నిజం కంట పడెగా!


సాయపడని భోరు బావి

సాగు లేక బీడు భూమి

అన్నదాత ఆకలి ఘోష

ఆలకించ ఎవరున్నారు

మట్టి మనిషి ఉపాధేమో

మచ్చుకైనా కానరాక

వేరు దారి లేనెలేక

వలస జీవి బ్రతుకైపోయే!


రైతే రాజన్న మాట

ఒట్టి మాట నీటి మూట!


పైరు పంట నాటి పొలము

ప్లాటులుగా మారెను నేడు

నమ్ముకున్న నేల తల్లిని

నేడు పెట్టే అమ్మకానికి

బ్రతుకిచ్చిన మా పల్లె

బలై పోయె  రోజు

తన వారు ఎవ్వరు లేక

తల్లడిల్లే తనలో తానే!


మా ఊరు పల్లెటూరు

మా పల్లె రోదన చూడు!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు