మధుసూదన ద్విశతకం


#117

ఓర్పు నేర్పులలో మనకన్నా మిన్న

వారు లేనిదే మనమన్నది సున్న

స్వాగతిద్ధాము వారిని సాధికారతనిచ్చి

మనసు పెట్టి వినరా మధుసూదనా!


#116

ఎదురు చూస్తున్నావంటు వెంటనే రాదు

తప్పించుక తిరగ చూడ తరలి పోదు

నూకలు చెల్లంగనే నిన్నెత్తుకెళ్ళు చావు

మనసు పెట్టి వినరా మధుసూదనా!


#115

తాళియంటే తాడు కాదు తెంపి పారవేయ

విప్పడానికి కాదు వేసింది మూడు ముడులు

విడిపోవు మనస్పర్థలు విచక్షణతో చర్చించిన

మనసు పెట్టి వినరా మధుసూదనా!


#114

చేయకూడని పనిని చేయమాకెప్పుడూ

చూచులే అంతరాత్మ చూడకున్ననెవరూ

అపరాధమన్నది అగ్గిలా దహించును

మనసు పెట్టి వినరా మధుసూదనా!


#113

విలువ లేదని సున్నాను వెలకట్టకుందుమా

పక్కనుండి సంఖ్య విలువ పదింతలు చేయునే

ఉన్నతి కోరే వ్యక్తుల వేలెన్నడూ విడువకు

మనసుపెట్టి వినరా మధుసూదనా!


#112

సరదా పరిచయాలు సాగిస్తే అలవాటుగా

అదుపు తప్పిపోయి ఆపదలు తెచ్చిపెట్టు

బానిస కాకముందే బంధనాలు తెంచుకో

మనసుపెట్టి వినరా మధుసూదనా!


#111

పురుగు గొంగళి నుంచి పుట్టిన సీతాకోక

చేరదీయ చేసేను చీదరించిన చేతితో 

పట్టుదలగ పరిశ్రమ ఫలితమిచ్చు తప్పక

మనసుపెట్టి వినరా మధుసూదనా!


#110

అపార్థం తెచ్చు అనవసరపు మాటలు

పొదుపు మాటలతో ప్రశాంతత దొరుకు

ప్రశాంత చిత్తమున పనులు సఫలమగు

మనసుపెట్టి వినరా మధుసూదనా


#109

ప్రయత్నమన్నది లేకుంటే పెరుగుదలెక్కడిది

గింజలెప్పుడు మొలకెత్తవు గాదెల్లోనే ఉంటే 

మన్ను చేరి నీరందగ మొలకెత్తును నాటుకొని

మనసుపెట్టి వినరా మధుసూదనా


#108

అల్పులేయని అధికార అహం చూపిన

చలిఎండకు చెలించని చీమల దండులా

కరినాగు కోరలు ఊడబెరుకు కలిసిగట్టుగా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#107

కావాలి అడిగినది కాదంటే కుదరదంతే

మార్పు వచ్చె స్వరంలో మారుతున్న తరంలో

కన్నవారిపై ప్రేమ కరుగుతున్న మంచు కొండే

మనసు పెట్టి వినరా మధుసూదన!


#106

వినయంతో ఉండు విజయలక్ష్మి వరించగ

వాపును చూసి బలుపను భ్రమలోనుండకు

తలకెక్కిన విజయం తిప్పలు తప్పక తెచ్చును

మనసు పెట్టి వినరా మధుసూదన!


#105

వినే సందర్భం వీక్షించే సమయం

వాస్తవికతను చూపొచ్చు వేరే విధంగా 

గుడ్డిగా నమ్మక గట్టిగా సమిక్షించు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#104

కలకాలం ఉండవు కమ్మిన మబ్బులు

కరిగిపోవు చినుకులై కలిగిన కష్టాలు

బ్రతుకు సుఖమగు బాధల మబ్బు వీడి

మనసు పెట్టి వినరా మధుసూదన!


#103

భారమగు మనసు బాధలు చుట్టుముట్ట

భవిష్యత్తుపై ఆశ బలముగా ఉన్నప్పుడు

నేడు బాధలెన్నున్నా నిన్నేమి చేయలేవు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#102

ఇల్లంటే నాలుగు గడపలు కలిపే ఇటుక గోడనా

వసతి లేని ఇల్లు విశాలమున్నా ఉపయోగమేమి

దేహానికే కాని దాహానికి పనికిరాని కడలి నీరల్లే

మనసు పెట్టి వినరా మధుసూదన


#101

నిజమెప్పుడూ నిష్ఠూరంగానే ఉండు

చెప్పే రీతిలో చెప్పిన ఫలితముండు

చేదు మందుకు చక్కెర తీపి కలిపినట్టు

మనసు పెట్టి వినరా మధుసూదన


#100

అద్దంలో చూసే అందం అశాశ్వతము

కాలంతో కరిగిపోవు కనిపించే అందం

మనిషిలోని అందం మది చూడగలదు

మనసు పెట్టి వినరా మధుసూదన


#99

మార్గదర్శకుడు మాధవుడు తోడుండ

నూరు దాయాదుల నేలకూర్చె ఐదుగురు

దార్శనికుడి ప్రోత్సాహాన ధరిత్రి గెలవచ్చు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#98

పాలలో దాగిన నెయ్యి పట్టవచ్చు

పెరుగుగా మార్చి వెన్న మరిగించిన

మనఃశుద్ధితో మహాత్ముడు కావొచ్చు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#97

నిప్పుతో కలిసిన ఉప్పులా కాకుండ

పాలు చక్కెరలా పతిపత్నులుండ

కమ్మగా కాపురం కొనసాగుచుండు

మనసు పెట్టి వినరా మధుసూదన


#96

మలినపు ఆలోచనతో మంచి ఫలితమా

చింత గింజ నాటినా చామంతులు వచ్చునా

తలపు మంచిదైన తలవంపులుండునా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#95

పన్నుల రూపంలో పీక్కుతినే పాలకులకు

పట్టణాభివృద్ధి మాత్రం పట్టదు ఏకొంచెం

కానరాదే మన గోస కళ్ళు లేనీ కభోదులకు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#94

మన నగరాలు మహా నరక కూపాలు 

కాలుష్య కంపు దారంతా గతుకులు 

తెరిచిన నాళాలు యమపురికి ద్వారాలు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#93

కాపురాన కలహం కూరలో కరివేపాకు

కొంచెంగా ఉంటే కలిగించునదో రుచి

మొదటికే మోసం మోతాదు మించితే

మనసు పెట్టి వినరా మధుసూదన!


#92

కాసులాశ చూపి కోరికలు కోరినంతనే

దుడ్డుపై ఆపేక్షతో దైవమనుగ్రహించునా

అల్పబుద్ధి తోటి ఆలోచనలు ఏలా 

మనసు పెట్టి వినరా మధుసూదన!


#91

ముత్యపు అక్షరాల మధుర పదాలు

భావ వ్యక్తీకరణకు బాగుగా వాక్యాలు

తరిగిపోని ఊట తేట తెనుగు భాష

మనసు పెట్టి వినరా మధుసూదన!


#90

భావమెంత క్లిష్టమైన బాగుగా పలికించు

పలుకు మాటతోటి పులకింత కలిగించు

తెలుగు భాషలోన తీపిదనం కనిపించు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#89

అర్ధించిన ద్రౌపతిని ఆపదలో ఆదుకున్న

అచ్యుతా వినలేవా అబలల ఆక్రందనలు

మధించ రావా మదమెక్కిన మృగాలను 

మనసు పెట్టి వినరా మధుసూదన!


#88

లాభమేమి కలుగు లక్ష దీపాలెలిగించ

దీపమొక్కటి చాలు దైవమనుగ్రహించ

జ్ఞాన జ్యోతి వెలిగి అజ్ఞానమంతరించ

మనసు పెట్టి వినరా మధుసూదన!


#87

వేషధారణయందు వేరులేకున్ననూ

పలుకు మాట బట్టి పసిగట్ట వచ్చును

స్వాములలో దొంగ స్వాములు వేరయా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#86

నేతి బీరకాయలో నెయ్యి ఎంతుండునో

నేటి రాజకీయాలలో నీతి అంతుండెను

విలువలు లేకపోతే విలువెక్కడుండును

మనసు పెట్టి వినరా మధుసూదన!


#85

నిగ్గదీసి అడుగు నీతి లేని నేతలని

బాధ్యతనెరుగక పదవులెందుకని

పదవులకోసం ప్రాకులాటెందుకని

మనసు పెట్టి వినరా మధుసూదన!


#84

దాన గుణం లేని ధనవంతుడి కన్న

పెద్ద మనసున్న పేదవాడు మిన్న

ఉల్లి చేసే మేలు ఊడల మర్రి చేసేనా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#83

సోదరి సోదరుల స్నేహానుబంధాల

తరగని విలువ తెలుపు రక్షాబంధనాలు

మంచి విలువల కూర్పు మన సంస్కృతి 

మనసు పెట్టి వినరా మధుసూదన!


#82

కడలిలో నీరు కొదవలేకున్ననుగానీ

కుత్తిక తడుపు కొంచెమైన కొలను నీరు

దాన బుద్ధి లేక ధనమెంత ఉంటేమి

మనసు పెట్టి వినరా మధుసూదన!


#81

అవకాశాలున్నచోట అవరోధాలుండొచ్చు

అవరోధాలధికమిస్తే అందలాలెక్కొచ్చు

అలసత్వం వీడి అడుగేయి ముందుకు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#80

బరిలో దిగాక బలవంతుడిగా పోరాడు

బంటు చదరంగంలో బలహీనుడైనా

మడమ తిప్పక ముందడుగు వేయును

మనసు పెట్టి వినరా మధుసూదన!


#79

దోస్తాన బాగుంటే దొరబాబులే అందరు

దోచుకుని దాచుకునే దొంగబాబులందరు

బెడిసిన దోస్తానాతో బాగోతం బయటపడు 

మనసు పెట్టి వినరా మధుసూదన!


#78

దశాబ్దాల స్వపాలనలో దారిద్ర్యమెందుకుండె

వారు పోయి వీరొచ్చిన వాసి మారకుండె

అభివృద్ది ఫలాలు అందరికీ అందకుండె

మనసు పెట్టి వినరా మధుసూదన!


#77

నడిరాత్రిన ఒంటరిగా నడిచివెళ్తే ఆడవారు

నిజమైన స్వాతంత్ర్యమనే నాడు గాంధీజీ

పట్టపగలు నడవలేని పరిస్థితుండె నేడు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#76 

నడి రోడ్డున మృగాళ్ళ నేత్తుటి ఆటలేలా

అబలల వేదన అరణ్య రోదనేనా

మదమనంచక మీనమేషాల మతలబేలా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#75

రాజ్యాలు లేకున్నా రాచరికపు పోకడలు

వేళ్ళు నాటుకున్న వారసత్వ జాఢ్యంతో

గణతంత్ర దేశాన గణతంత్రమెక్కడుండు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#74

అడిగిన వానికి అన్నమన్నది పెట్టక

అడగని దైవానికి ఆరగింపు సేవలేల

నరుడిలో చూడొచ్చు నారాయణుడిని 

మనసు పెట్టి వినరా మధుసూదన!


#73

ఆగని హత్యాచారాలు అవినీతి అరాచకాలు

భరతమాత కీర్తికి భంగం కలిగించుచుండగ

అమరవీరుల ఆత్మలెంత ఆవేదన చెందునో

మనసు పెట్టి వినరా మధుసూదన!


#72

రమ్మని కబురంపాల రవిచంద్రులకు

తమ పనిని తాము తప్పక చేయునే

బుద్దిగా పనిచేయక బద్దకము నీకేల

మనసు పెట్టి వినరా మధుసూదన!


#71

కఠిన ఇనుమునైనా కరిగించవచ్చు

బండ రాయినైనా పిండి చేయవచ్చు

మూర్ఖ మానవుడి మది మార్చలేము

మనసు పెట్టి వినరా మధుసూదన!


#70

ముళ్ళ దారులెన్నివున్నా మొక్కవోని దీక్ష తోటి

అలుపులేని అలలవోలే ఆగకుండా సాగిపోయే

ప్రయత్నానికి ఫలితముండు విజయలక్ష్మి వరించుచుండు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#69

విపరీత బుద్దుల వికృత చేష్టలు

మానవాళికే మాయని మచ్చను తెచ్చే

సాటివారి బాగు కోరని సాంకేతికతేల

మనసు పెట్టి వినరా మధుసూదన!


#68

చినుకులన్నీ చేరగా చెరువంతా నిండులే

కరములన్నీ కలపగా కొండంతా పిండగులే

ఒకరికొకరు తోడవగా ఒఱకములు పోవులే

మనసు పెట్టి వినరా మధుసూదన!


#67

కన్నవారిని బాధించు కరుణలేని పిల్లలకి

కన్నపిల్లలు చూపులే కన్నవారి బాధని

ఆసాంతం తిరిగిచ్చు అసలుకు వడ్డీ కలిపి

మనసు పెట్టి వినరా మధుసూదన!


#66

అంతరించకున్న ఆర్ధిక అసమానతలు

అందమైన దారులు ఆకాశహర్మ్యాలు 

కాజాలవు అభివృద్దికి కొలమానాలు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#65

ఆపేక్షతన శిష్యుల అక్కున చేర్చుకొని

అజ్ఞాన తిమిరాలు అంతమొందించు

గురు భాస్కరులు గౌరవనీయులు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#64

ద్రోణుడు లేక ధనుంజయుడు లేడు

గురువు కనిపెట్టి గురి చూపెట్టకున్న

మట్టిలోనే మగ్గిపోవు మాణిక్యాలెన్నో

మనసు పెట్టి వినరా మధుసూదన!


#63

మనుషులంతా ఒక్కటే మతమేదైనా

ఎర్రని రక్తమేవుండు  కులపోడికైనా

మానవత్వం మిన్న మతకులాల కన్నా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#62

కరిగిపోవు కష్టాలు కన్నీరు కారుస్తుంటె

మేడెక్కలేవు మెట్లు చూస్తూ కూర్చుంటె

ఫలితమెక్కడుండు ప్రయత్నించకుంటె

మనసు పెట్టి వినరా మధుసూదన


#61

సప్తపది కాపురం సప్తస్వర సంగీతం

సరిగా కూర్చిన స్వరాగాలు ఎన్నెన్నో

కూర్పు తెలియక కుంటి సాకులేల

మనసు పెట్టి వినరా మధుసూదన


#60

జిహ్వచాపల్యానికి జేజేలు కొడుతూ

క్రమశిక్షణమాని కడుపునింపుచుండ

చెత్తకుప్పగ మారి చేసేను కీడెంతో

మనసు పెట్టి వినరా మధుసూదన


#59

మన మనిషి మనను వీడినపుడు

మది బరువెక్కు మునుపటి తలపులతో

మరుపే ఔషధం మది బరువుదించ

మనసు పెట్టి వినరా మధుసూదన


#58

పక్కవాడి స్థితిని పరిహసించకెపుడు

ఎట్లుండునో భవిష్యత్ ఎవరికెరుక

చెరువులోని రాయి చేరొచ్చు గర్భగుడి

మనసు పెట్టి వినరా మధుసూదన!


#57

అతి మంచితనం అన్నివేళల అనర్ధం

మంచిదని ఔషధం మరింత గ్రోలిన

గరళముగ మారి గందరగోళం చేయు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#56

భయపడకు నీవెపుడు బాధలెన్నివున్న

కటువు బాధలన్నవి కలకాలముండవు

కృష్ణపక్షము దాటి శుక్లపక్షముండు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#55

నీ జీవన పయనంలో నీవు కలిసేదెందరినో

గడువులు వేరైనా గమ్యమందరిదీ ఒక్కటే

అనుభూతుల గుర్తులే ఆఖరికి మిగిలేవి

మనసు పెట్టి వినరా మధుసూదన


#54

బ్రతకాలన్న ఆశ బలముగానున్నపుడు

బాధలెంతున్న భారమనిపించదెపుడు

బ్రతుకు తీపినెరిగిన బ్రతుకు ఆశ పెరుగు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#53

ఒంటరిగా వస్తాము ఒంటరిగా పోతాము

ఉందాము కలివిడిగ ఉన్నంతవరకు

పోయేది ఏముంది పోరు నష్టం తప్ప

మనసు పెట్టి వినరా మధుసూదన


#52

కోట్లాదిపతికైన కడు పేదవాడివోలె

కాడు చేరినపుడు కాసులెంటరావు

కోట్ల కాసులకన్న కాస్త పుణ్యముమిన్న

మనసు పెట్టి వినరా మధుసూదన!


#51

వైకుంఠపాళంటి వ్యక్తి జీవితములో

ఉథ్థాన పతనాల ఊగులాటలెన్నున్న

పరమపదము చేరు ప్రయత్నాలుండాలి

మనసు పెట్టి వినరా మధుసూదన!


#50

మహిని గెలిచినా మరువకు నీ మూలాలు

మూలాలు మరిచిన మనిషి మనుగడ

ఆధారము తెగి ఆగమైన గాలిపటమోలె

మనసు పెట్టి వినరా మధుసూదన!


#49

గూటిలోని గాలిపటం గాలిలో ఎగురుచుండ

గొప్పతనం మొత్తంగా గాలిపటానికెట్ల కలుగు

ఓపికన దారాన్ని ఒడుపుగ కదిపేవాడుండగ

మనసు పెట్టి వినరా మధుసూదన!


#48

కాసుల చింతేల కాటికెళ్ళు వరకు

కానరావు కాసులు కాడు చేరినపుడు

కలిగుండు నలుగురిని కలకాలం తలవంగ

మనసు పెట్టి వినరా మధుసూదన!


#47

పట్టెడన్నముతో పొట్ట నిండునపుడు

కక్కుర్తి పడనేల కాసుల సంపాదనలో

కోటీశ్వరులేమి కాసులన్నం తినరుగా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#46

పంచభూతాల సాక్షిగా పెనవేసిన బంధాలు

గాలివాటంగా సాగే నీటి బుడగలాయే

నింగి చేరక నేల రాలే చిన్నచిన్న చిచ్చులకే 

మనసు పెట్టి వినరా మధుసూదన!


#45

మనసులు కలవని మొహమాట కాపురం

కలవని పట్టాల కలిసి పయనమోలె

దూరమెంత వెళ్ళినా దెగ్గరెప్పుడు కావు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#44

ఒరిగేది ఏముంది ఓర్వలేనితనముతో

జరిగేది ఎప్పుడు జరగకుండ ఆగదు

పద్దతి మార్చుకుంటే ఫలితం వేరుండు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#43

మన్నంటక పెరిగిన మేలైన విత్తనం

మన్ను చేరకున్న మొలకెత్తకుండు

కలిమి విలువెక్కడ కష్టమెరుగనపుడు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#42

మరణించి మనిషి మన్ను చేరుతుండె

మన్ను చేరి విత్తనం మొలకెత్తుతుండె

ఆశలుడిగిన చోటున అవకాశాలుండె

మనసు పెట్టి వినరా మధుసూదన!


#41

కాలానికి ఉండదు కనికరం ఏమాత్రం

ఆరు నూరైనా ఆగదు క్షణమైనా

కరిగిన కాలంపై కలుగు చింతలేల

మనసు పెట్టి వినరా మధుసూదన!


#40

ప్రోత్సాహకాలేల పుట్టిన కులము బట్టి

అసమానతల అంతరాలు అంతరించ

అవకాశాలుండాలి ఆర్థిక స్థితిగతుల బట్టి

మనసు పెట్టి వినరా మధుసూదన!


#39

పండ్లున్న చెట్టుకే పడును రాళ్ళ దెబ్బలు

కరిగిపోవు మనసుకే కలుగు తల నొప్పులు

ముండ్లెన్ని ఉన్నా మంచి దారి వీడబోకు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#38

మొగ్గలోనే త్రుంచు మనస్పర్థల భూతాన్ని

పగులు చిన్నదని పట్టించుకోకున్నా

తెగును ఆనకట్ట తీవ్రతెక్కువవగా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#37

అయినవారి మీద ఆధారపడునేల

సొంత కాళ్ళ మీద సాధించి చూపెట్టు

వృక్షమొదలని విత్తు వృక్షమెప్పుడవదు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#36

ఏడడుగుల బంధంతో ఏకమైన ఇద్దరు

తాళిమి మరిచి తప్పటడుగులు వేస్తుంటే

అగ్నిసాక్షి బంధం అగ్గిపాలు అయిపోదా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#35

పండ్లిచ్చిన చెట్టుకు పండునివ్వబోముగా

పాలిచ్చిన ఆవుకు పాలు పోయబోముగా

చేకూరిన సాయానికి చేతనైన సాయమివ్వు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#34

ఫలితంపై ధ్యాసేల పనిపై గురిపెట్టు

ఆయాస పడబోకు ఆలోచించి అతిగా

కలిగేది ఎప్పుడు కలగకుండ ఉండదు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#33

కుర్రి సుష్కించగ కబేళానికి చేరులే

ముసలి తల్లి మజిలి వృద్ధాశ్రమమాయే

పాలిచ్చి పోషించగ ప్రతిఫలము ఇదేనా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#32

కటువైన కాకర కలిగించు మేలు

తియ్యటి చక్కెర తెప్పించు రోగాలు

మాట రుచినెరిగి మసలుకో ఎల్లపుడు 

మనసు పెట్టి వినరా మధుసూదన!


#31

అవసరానికి మించి ఆస్తి సంపాదనేల

కోట్లాస్తి కూడపెట్ట కలుగు చింతలేల

ఆనంద జీవనానికి ఆస్తితో పనియేల

మనసు పెట్టి వినరా మధుసూదన!


#30

ఎక్కడ పుడతారో ఎవ్వరైనా ఎరుగుదురా

పరమార్థం దాగుండు ప్రతి పుట్టుక వెనుక

జీవితార్థం గ్రహించి జీవించు ఉన్నతంగా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#29

నా కులమే గొప్పంటూ నానాయాగీ చేస్తావు

 కులములో పుడతావో ఎరుకనా నీకసలు

పుట్టిన కులము కన్నా పెరిగిన గుణము మిన్న

మనసు పెట్టి వినరా మధుసూదన!


#28

కొండంత ఆశయం కొంచెమైపోయెగా

కొల్లాయి తాత కార్యదీక్ష ముందర

కండ బలం కన్నా కార్యదక్షత మిన్న

మనసు పెట్టి వినరా మధుసూదన!


#27

ఒక్క చేతి వేళ్ళే ఒక్కతీరుగ లేనపుడు

పక్కవాడితోటి పోల్చుకునేదెందుకు

సారమును బట్టి సాగు దిగుబడి ఉండు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#26

ఆశించకు దేనిని అప్పనంగ అవతల నుంచి

ప్రతిగా ఆశించు వారు ప్రతిఫలము నీనుంచి

భారమైన అంచనాలతో భంగపాటు పడనేల

మనసు పెట్టి వినరా మధుసూదన!


#25

నమ్మిన సిద్ధాంతాన నడిపించు జీవితాన్ని

పద్దతి మార్చకుండు పరుల మెప్పుకోసమని

చిక్కులెన్ని ఎదురైనా చింతించకు కడవరకు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#24

ఎదుటివారి మెప్పుకోసం  పని చేయమాకు

విచక్షణతో ఆలోచించి వేసేయి ముందడుగు

తలదించకు ఎప్పుడు తప్పుకానంత వరకు 

మనసు పెట్టి వినరా మధుసూదన!


#23

ఒట్టి చేతులతో వచ్చి ఒంటరిగా పోతావు

నీవు లేని ప్రపంచాన నీ జ్ఞాపకాలే మిగులు

కాలగర్భంలో కలిసి కనుమరుగగు బ్రతుకేలా

మనసు పెట్టి వినరా మధుసూదన


#22

చూడవేప్పుడు కనులు చెవులు విన్నదంతా

కనులు చూసినదంతా కాదులే నిజాలు

పనికిమాలిన మాటలు పెడచెవిన పెట్టు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#21

గురి తప్పనీయకు గెలిచేంతవరకు

ఆపకు ప్రయత్నాన్ని అలుపెంతున్నా

అలుపుతో సూరీడు ఆగిపోతుండునా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#20

ఉలి దెబ్బలకు ఉసూరుమనకా

పట్టుదలగా పరిశ్రమ చేయగ

శిల లాంటి నీవు శిల్పం కావా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#19

కాలి నడక జీవితాన కోరినంత సమయముండే

వేగవంత జీవితాన వెసులుబాటు లేకపోయే

అలుపెరగక పరుగెడుతూ అర్ధంలేని జీవితమాయే

మనసు పెట్టి వినరా మధుసూదన!


#18

గలగల మాట్లాడ గొప్పేమీ కాదు

గులక రాళ్ళు కూడా గలగలలు చేసేను

మాట విలువ నెరిగి మసలుకో ఎల్లప్పుడు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#17

అదుపు లేని నోరు అడ్డగోలుగ వాగు

నోరు జారిన మాట నిరతముగ వెంటాడు

మాట పలుకు బట్టి మనిషి విలువ ఉండు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#16

సరైన వైద్యమివ్వని సర్కారు దవాఖానలు

కాసుల కకుర్తిన కార్పోరేట్ ఆసుపత్రులు

బడుగుజీవి ప్రాణానికి భరోసా లేకపోయే

మనసు పెట్టి వినరా మధుసూదన!


#15

అన్నివేళల సరికాదు అతి మంచితనము

స్వచ్చమైన బంగారం సులువుగ వంచబడు

రాగి మలినము తోటి రాటు తేలును చూడు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#14

అవసరాన జనులు అతివినయం చూపు

కానరాదు వినయం కడుపు నిండినపుడు

మసకబారును బుద్ది మరిచిన సాయమున 

మనసు పెట్టి వినరా మధుసూదన!


#13

బకెట్ నీళ్ళతో బోలెడు అంట్లు కడిగె నాడు

కుళాయి నీటికి కొంచెమైనా పొదుపేది నేడు

తీరు మారకుంటే తిప్పలొచ్చును చూడు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#12

పుట్టిన కులము పెంచదు నీ గౌరవము

గౌరవమెక్కడుండు గుణము పెరగకున్న

పూత పూసిన కంచు పుత్తడెప్పుడు కాదు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#11

జాత్యహంకార జాఢ్యం జన శ్రేయస్సు కోరునా

మతఛాందస మౌఢ్యం మనిషిని మనిషిగ చూసునా

నాగరిక సమాజములో అనాగరిక ఆలోచనలా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#10

మార్పు కోరుతుంది మొరుగు పడగ సమాజం

మనమెందుకు కాకూడదు మంచి పని చేయ

ముందుండి నడిపించగ మార్పు తీసుకరాగ

మనసు పెట్టి వినరా మధుసూదన!


#9

మనమంటే సమాజం మనవెంటే సమాజం

మచ్చలేని సమాజం మచ్చుకైన ఉండునా

మురికి కాలుకంట కాలు నరకబోముగా

మనసు పెట్టి వినరా మధుసూదన!


#8

కఠిన సమయమున కావాలి సంయమనం

భయాన్ని తొలగించి భరోసాని కలిగిద్దాం

విజ్ఞతతో ఎదురొడ్డి విజయ జెండా ఎగురేద్దాం

మనసు పెట్టి వినరా మధుసూదన!


#7

ఓటి కుండలో నీళ్ళెక్కడుండు

ఒట్టి మాటలలో విలువెక్కడుండు

విలువలేని మాట మాట్లాడకుండు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#6

కొడుకుమీది ప్రేమ కూతురిపై లేదేల

ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదా

అప్పగింతలతోటే ఆగిపోవునా బంధం

మనసు పెట్టి వినరా మధుసూదన!


#5

ఆవేశమున మాటలు అనర్థాలు తెచ్చు

తమాయించుకున్న తలనొప్పులుండవు

ఆలోచనతో మాట్లాడు ఆవేశమునగాక

మనసు పెట్టి వినరా మధుసూదన!


#4

భక్తి లేని పూజ భగవంతుని చేరనేల

విలువలు లేని విద్య ఉపయోగమేల

శ్రద్ధ లేని పనులు సాధించునదేమి

మనసు పెట్టి వినరా మధుసూదన!


#3

కూడబెట్టిన సొమ్ము కాష్టంలో తోడురాదు

లోక కళ్యాణార్ధం లోభితనము వీడు

పేరు కోసం సాయం ఫలితమివ్వదెన్నడు

మనసు పెట్టి వినరా మధుసూదన!


#2

అవసరాల స్నేహం అద్దమల్లె ఉండు

పగిలిన అద్దంతో ప్రమాదముండు

ప్రమాదాలు తెచ్చే పరిచయాలు ఏల

మనసు పెట్టి వినరా మధుసూదన!


#1

కలహాల కాపురాన కలిమెక్కడుండు

దుష్ట స్నేహమందు నష్ట మెక్కువుండు

అనాలోచిత పనులతో అపార్ధాలుమెండు

మనసుపెట్టి వినరా మధుసూదన!


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు