రాజకీయాలు

 

ఏ పార్టీలో ఉంటారో, నేతలకు లేదు క్లారిటీ

పొత్తులెలా ఉంటాయో, పార్టీలకు లేదు క్లారిటీ

ఎందుకు ఓటేస్తున్నాడో, ఓటరుకు లేదు క్లారిటీ

ప్రజాస్వామ్య పెద్దన్న దేశంలో, ఉన్నదొక్కటే క్లారిటీ

ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం!

——-


ఓరి ఓటరు దేవుడో ఓటు నాకు వేయరో

కోట్లు ఖర్చు పెడితినీ కొంప ముంచబోకురో!

బీరు సీసాలు బిర్యానీ పొట్లాలు

అప్పనంగా ఆపైనా పైసలిస్తినే

అసలు ఎవరైనా నాలాగా అరుసుకుంటరా

కనుక నీ ఓటు నాకెయ్యి ఓరి నాయనా ॥ఓ॥

——


ఓట్ల పండుగ వచ్చిందంటే 

ఓరి నాయనో సూడు సిత్రాలు!

ఉద్దరించేది మేమేనంటూ 

ఊదరగొట్టే ఊసరవెల్లులు!

అద్భుతమైన మేనిఫెస్టోలు

అడగకుండానే అన్నీ ఉచ్చితం!

ప్రజా సేవంటు పైపై మాటలు

పైస పెత్తనం అంతిమ లక్ష్యం! ॥ఓ॥

——-


పెరుగుతున్న ధరల ప్రశ్నించే గొంతేది?

దారిద్ర్య నిర్మూలనకు దారులెతికేదెవరు?

ఉపాధి కల్పన గూర్చి ఊసెక్కడున్నది?

రోజుకో అనవసరపు రచ్చతో రాజకీయాల రొచ్చు!

తైతక్కల మీడియా తానా అంటే తందానా!

——-


అందరికీ న్యాయం అంతటా స్వేచ్ఛా సమానత్వం

మన రాజ్యాంగం మనకిచ్చిన భరోసా బాధ్యత

ఆచరిస్తున్నామా మనసా వాచా కర్మణా

——-


అడ్డగోలు ధరలకు ఆకాశమే హద్దు

రైల్లల్లో వృద్ధులకు రాయితీలు రద్దు

వేల కోట్లు ముంచు మోసగాళ్ళు ముద్దు

అద్భుతమైన పాలనకు అడ్డు చెప్పవద్దు

——


రాజకీయ చదరంగంలో రోడ్డు షోల ట్రెండు

జన సమీకరణే ముఖ్యం జాక్ పాట్ కొట్టడానికి

పేరేమో నేతలకు పావులుగా రోజు కూలీలు

పోయిందా కూలీ ప్రాణం పదిలక్షల పరిహారం!

——


పండిన పంటకు గిట్టుబాటుకై

నెలల తరబడి చలికి కాచుకొని

ఢిల్లీ లోనా లొల్లి చేసిన

అన్నం పెట్టే అన్నదాతలకు

సున్నం పెట్టిన ప్రభుద్ధులెవరు

———


ప్రజా సంస్థలకు పాలకుల పేర్లు

సొమ్మొకడిదైతే సోకొకడిదాయే!

వ్యవస్థ నిండుగా వ్యక్తి పూజలాయే

గొర్రెదాటు మంద గాండ్రించలేదులే

——


రేయింబవళ్ళ రెక్కల కష్టం

పైసా పైసా పోగు చేయగా

రక్తం మరిగిన రాబందులు

దొరల రూపంలో దోచేస్తుంటే

దగా పడిన  తమ్ముడా

మరో విప్లవానికి ముందడుగేయి!

———


ఉజ్వల యోజనంటూ ఊకదంపుడే

గ్యాసు బండ వంటింట గుదిబండే

జన ధన ఖాతాలు జోరుగా తెరిపించే

నల్ల ధనమేదంటే తెల్ల మొహమేసే!

పది లక్షల కోట్లు పందికొక్కులు తింటే

పేదోళ్ళ రాయితీలకు పైసలెక్కడుండే

———

నింగికి చేరిన ధరలు పట్టవు

వేతన జీవుల వెతలు పట్టవు

కాకుల కొట్టి గద్దకు పెట్టగ

కాకలు తీరిన నేతలు వారు

——-


నీతిమంతులమనే నేతి బీరకాయలు

కమీషన్ లేనిదే కదలని ఫైళ్ళు!

మత విద్వేషపు మురికి మాటలు

కర్రు కాల్చి వాత పెట్టిన కన్నడిగులు!

———


మనవాడే వడ్డిస్తే కంచం నిండా కావలసినవన్నీ

లక్షల కోట్ల అప్పులు అప్పన్నంగా ప్రభుత్వ ఆస్తులు

దొంగ లెక్కలతో దొరలు కష్ట పడకుండా కుబేరులు

మంచి రోజులు వచ్చాయి మోసం చేసే వారందరికీ!

——-


భావ స్వేచ్ఛయంటు బరితెగింపుతో 

అర్థ సత్యాల అభూత కల్పనలతో 

కాకి లెక్కల కల్పిత కథా చిత్రాలు

మలబారు మొదలు కాశ్మీర్ వరకు

మత విద్వేషాల మంట రాజేస్తుండే!

——-


పైసలుంటే పార్టీ టిక్కెటొచ్చు

పైసలుంటే ప్రజల ఓట్లొచ్చు

పైసలుంటే పదవి గెలవొచ్చు

పైసలుంటే ప్రభుత్వం కూల్చొచ్చు!

పైసల కొరకుపైసల చేతపైసలే ఎన్నుకొనే

పైసలస్వామ్యమాయే మన ప్రజాస్వామ్యం!

———-


ప్రపంచానికే పెద్దన్నలం

ప్రజాస్వామ్య దిక్చూచిలం!

నికార్సైన నేతల తొలితరం

నిజాయితీ నిబద్ధతే ప్రాణం!

మారుతున్న తరాలతో 

మారిపోయే రాజకీయం!

విలువలు కూడిన రాజకీయం

వెలవెలబోతున్న దౌర్భాగ్యం!

అవకాశవాద నేతల పుణ్యం

అభాసుపాలవుతున్న ప్రజాస్వామ్యం

————-


ఓటెందుకు వేస్తున్నాడో ఓటరుకి తెలియదు

 పార్టీలో ఉంటాడో ఎమ్మెల్యేకి తెలియదు!

రిటైల్ కన్నా హోల్ సేల్ మిన్నగా 

వ్యాపార కోణంలో రాజకీయ వ్యవహారం!

ప్రజాక్షేత్రం దండగ పార్టీ ఫిరాయింపులుండగ

నేతి బీరకాయ నేటి మన ప్రజాస్వామ్యం!

——-


వీరంటారు సెస్సు వారంటారు వ్యాటు 

తమాషా చేస్తున్నరు తగ్గించాల్సినోళ్ళు 

పాలకులకు పట్టదాయే ప్రజలు పడే గోస

ఇక్కట్లు తప్పకుండె ఇంధన రాజకీయంతో!

—————


పాలకులు ఎవరికైనా పదవియే పరమావధి 

పదవినిల్పు ఉచితాలు పారించును ఏరులై

సంపద సృష్టించక సాగించిన ఉచితాలు

ఋణ భారం పెంచి రావణకాష్టంగా మార్చు

————-


రామ రామ రామ ఉయ్యాలో

రాజకీయాలు చూడు ఉయ్యాలో!!


తండ్రి నేత అయితే ఉయ్యాలో

తనయుడూ నేతే ఉయ్యాలో

ఎంత శుంఠలైనా ఉయ్యాలో

ఏలేయవచ్చును ఉయ్యాలో 

అర్హత లేకున్న ఉయ్యాలో

అధికారమొచ్చును ఉయ్యాలో

రామ రామ రామ ఉయ్యాలో

రాజకీయాలు చూడు ఉయ్యాలో!!


పైసలుంటేనూ ఉయ్యాలో

పదవులు దొరికేను ఉయ్యాలో

దొరికిన పదవితో ఉయ్యాలో

దోచుకోవచ్చును ఉయ్యాలో

కొంచమేమీ కాదు ఉయ్యాలో

కోట్లకు కోట్లూ ఉయ్యాలో

రామ రామ రామ ఉయ్యాలో

రాజకీయాలు చూడు ఉయ్యాలో!!


అడుక్కోవడం ఉయ్యాలో

అమ్ముడు పోవడం ఉయ్యాలో

నేటి రాజకీయాల్లో ఉయ్యాలో

షరా మామూలే ఉయ్యాలో

నీతీ నియమాలు ఉయ్యాలో

నిక్కచ్చిగా ఉండవు ఉయ్యాలో

రామ రామ రామ ఉయ్యాలో

రాజకీయాలు చూడు ఉయ్యాలో!!

—————-


చీమలు కట్టిన పుట్టలో చేరునట్టు పాములు

ప్రజల సొమ్ము పథకాలకు పాలకుల పేర్లు

సొమ్ము ప్రజలదైనా సోకు మాత్రం నేతలది

పేరు కోసం ప్రాకులాట పైసా ఖర్చు లేకుండా!

—————


నోటు తోటి ఓటు కొని జనుల తోటి ఆటలాడు

నేటి నేతల నోటి మాటలు ఓటి కుండలు

ఒట్టి మాటలు విలువలేని నోటు కట్టలు 

ఓటు అంటే ఆట కాదు నోటు తోటి గెలవలేరు

—————


ఆడవారి వ్యక్తిత్వం అపహాస్యం చేయు

వ్యక్తి దూషణం వాక్చాతుర్యమగునా!

నాకేటి సిగ్గంటు నరం లేని నాలుక

అడ్డగోలుగ మాట్లాడ అర్థమేమున్నదా

అహం తలకెక్కి అంధులైన అమాత్యులకు

ప్రతిపక్షం తప్ప ప్రజల సమస్యలు పట్టవా!

చూస్తున్న ప్రజలు చేతకాని వారు కాదు

కరిగించు కావరం కాల్చిన కర్రుతో వాతపెట్టి!

————


ఎన్నెన్నో ఆశలు చూపి ఏదేదో చేస్తానని చెప్పి

అరచేతిలో స్వర్గం చూపి అవకాశమిమ్మని అడిగే

అనుభవాన్ని కాదనుకొని కొత్తదనాన్ని కోరిన ప్రజలు

అవకాశమిచ్చెను నాడు ఐదేళ్ళ అధికారానికి!

పరిపాలన పక్కనపెట్టి ప్రతిపక్ష పీడన పట్టి

నిరంతరం ఒకటే తీరుగ నిర్లజ్జగ దూషణ పర్వం

పుణ్యకాలం సగమైపోయే ప్రగతి అన్నది కానరాదే

ఎదురుచూసిన అభివృద్ధేమో ఎండమావైపోయే!

————


రాజధాని కోసమంటూ రాసిచ్చే తమ భూములు

నమ్ముకున్న నేలతల్లిని నమ్మబలికిన పాలకులకై

పిల్లిమొగ్గలేస్తున్న ప్రభుత్వాల తీరుతో

అమరావతి రైతుల ఆక్రందన చూడరా

అన్నం పెట్టే రైతుకు సున్నం పెడుతున్నారు!

———-

చీమలు కట్టిన పుట్టలో చేరునట్టు పాములు

ప్రజల సొమ్ము పథకాలకు పాలకుల పేర్లు

సొమ్ము ప్రజలదైనా సోకు మాత్రం నేతలది

పేరు కోసం ప్రాకులాట పైసా ఖర్చు లేకుండా!

——-

ఏ ఎండకు ఆ గొడుగు పట్టేయి
ప్రజాస్వామ్య విలువలు పాతరేయి
అధికారమే లక్ష్యంగా అడుగేయి
అందినంత అప్పనంగా దోచేయి!
——
కుల పిచ్చి మత పిచ్చితో ఖరీదైన రాజకీయం
అధికారమే పరమావధిగా విలువల సమాధి!

ధనవంతులే పాలకులనే సూక్తి మరువకుండా
దశాబ్దాల వారిగా ప్రజాస్వామ్య అపహాస్యం!

ఒక్కసారి పెట్టుబడి ఐదేళ్ళ రాబడి
వీరు పోయే వారు వచ్చే ఎక్కడి గొంగళి అక్కడే!

మారవు మన బ్రతుకులు మారకుంటే మన తీరు!
ఓటేద్దాం బాధ్యతగా రేపటి మార్పు కోసం!
——-

ఐదేళ్ళకొకసారి వచ్చె ఓట్ల పండగ
మందూ బిర్యానితో విందు చేసుకుంటివి!

ఓటు నీ హక్కు అన్న విచక్షణను వదిలేసి
రాజకీయ నాయకులకు అమ్ముకొని దానిని
కమ్మిన మైకంలో గెలిపిస్తివి కభందులను!

మత్తు వదిలాక విలపిస్తివి నీ స్థితికి
చేతులు కాలాక ఆకులు ముట్టిన చందంగా!

మేలుకో మిత్రమా! మేలుకో సోదరా!
నీ చేతిలో ఉంది నీ బ్రతుకు బాగోగు
నిగ్గదీసి అడిగే నీ హక్కుని కోల్పోకు!
——-


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన హైదరాబాదు