తాతయ్య!

 

#1:

తాతయ్యా

నా జీవిత పుస్తకంలో 

నీది ఒక ముఖ్యమైన పాత్ర

ప్రతి పాఠంలో భాగమైనావు 

ప్రతి పుటలో స్పురణకొస్తావు

పాలు త్రాగే పసితనం నుంచి 

పెంచి పెద్దవాడిని చేసావు నన్ను

నాపై కురిపించావు నీ ప్రేమనెంతో

నేనేది సాధించినా నీదిగా ఆనందపడ్డావు

నలుగురికి గొప్పగా చెప్పుకున్నావు

నేనేమిచ్చి తీర్చుకోగలను నీ ఋణం

ఆగకుండా కారుతున్న అశ్రువులు తప్ప!


#2:

రమ్మని పిలిచే గొంతు మూగబోయెలే

అక్కున చేర్చుకునే చేతులు కదలకుండెలే

ఆప్యాయత నిండిన గుండె ఆగిపోయెలే

చిరునవ్వుల మోమున శాశ్వత నిద్రనిండెలే!


#3:

కనికరం లేని కాలం కాటు వేసింది

మానుంచి నిను మాయం చేసింది

మా మధ్య నీవు మరి లేకపోయినా 

మాలోనే ఉన్నావు మాతోడై ఉంటావు

కొండంత నీ స్మృతులు కలకాలముండగ

కటువైన నిజాన్ని కలలా మరిచిపోలేము

కలిగిన వ్యధను కన్నీటితో కరిగించలేము!


#4:

అనగనగ ఒక చిన్న దీవిదాని పేరు ‘కష్టం

కష్టంను ఎపుడూ వరదలు ముంచు

దానిలో ఉండే ఒక పేద కుటుంబం

కుటుంబ భారం మోసే పెద్ద

రేపటి రోజు బాగు కోసము సాగించెను 

పయనం ఆవలి ఒడ్డును చేరుట కొరకు

పడవ నిండుగా పరివారముండగా

అటు ఇటు ఆగని అలల నడుమన

చాకచక్యమున చుక్కాని తిప్పుతూ

కొనసాగించెను కడలి ప్రయాణం

అలుపెంతున్నా ఆగని పయనం

అంతిమ లక్ష్యం అందేవరకు

చెమటగా మార్చి నెత్తుటినంతా

చెర్చెను పడవను ‘సుఖమను దీవికి

పరివారమంతా ‘సుఖం ఉండగ

ఆనందిస్తూ అస్తమించెను 

అలసిన వయసున కుటుంబ పెద్ద!


మన మధ్య లేనపుడే మనిషి విలువ తెలిసేను!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు