నిర్భయ

 

పూటకో ఉన్మాది పుట్టుకొస్తుండే

ఆడబిడ్డల ఉసురు ఆరిపోతుండే!

మరణ శాసనమే మృగాలకు మందు

తప్పు తలిస్తే తడిచిపోవాలి మున్ముందు

——-

పదవులు పలుకుబడి మెండుగానుండినా

చట్టాల లోపాలు చుట్టాలు అగునులే!

మృగాలుగా మారి మానం హరించిన

బాలురంటూ అందించు బెయిలును

——


దిక్కు తోచని లేడిపిల్ల 

దిక్కెవరంటూ ఎదురు చూడగా

మాటు వేసిన మృగాలు నాలుగు

మానం హరించి ప్రాణం తీస్తే

గగ్గోలెట్టని హక్కుల సంఘం

గొల్లుమనెను మృగాల వధించగ

మృగాలకెందుకు మానవ హక్కులు?

———


కాటు వేస్తాడొకడు కామంతో

అంతం చేస్తాడొకడు అనుమానంతో

ప్రాణం తీస్తాడొకడు ప్రేమంటూ 

కాల్చుకు తింటాడొకడు కట్నమంటూ


ఆడది అంటే అబల అనుకొని

మృగాలు గా మారిన మగాళ్ళ

కోరలు పీక కాళికా మాతగా

అవతరించ అవసరమిప్పుడు!

————


మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం

చప్పట్లు కొట్టి చేతులు దులుపుకొంటాం

నిర్భయా దిశలు నిరంతరం చూస్తుంటాం

చిత్తశుద్ధి లేని చేతలెప్పుడూ 

అబలలపై ఆకృత్యాలు ఆపవెప్పుడూ!

——-


చేసేవన్నీ పెద్ద తప్పులు

తొడిగేస్తారు మైనరు ముసుగులు

తప్పుకు తగ్గ శిక్ష వేయక

తక్కువ వయసని తర్కమేంది!


న్యాయమన్నది ఒకటే కాదా

నేతల కొడుకులు అతీతులా!

పైసా పరపతి ఉన్నాయంటే

చట్టాలన్నీ తమ చుట్టాలేనా!

——


తెలిసీ తెలియని వయసు
ఎదిగీ ఎదగని మనసు!
చిగురించిన చిన్ని వ్యామోహం
ప్రేమ అనుకొంటివి భ్రమలో!
కాదనుకొని కన్నవారిని
తోడై పోతివి కసాయితో!
మగాడి చాటున మృగమై వాడు

కోరిక తీరగ కాటికి పంపెను!
——-



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు