తెలంగాణ
గునుగూ గుమ్మాడి బంతీ చామంతి
తంగేడు పూల తల్లీ బతుకమ్మ!
బతుకు కోరి భక్తి తోటి ఆడబిడ్డల ఆటపాటలు
తరతరాల ఆచారంగా తెలంగాణ సంబురాలు!
——
నా భాష నా యాస
నా శ్వాస నా ధ్యాస
నా తెలంగాణ నరనరానా!
—-
తెలంగాణ
ఆ పలుకు భావోద్వేగం
ఆరు సహస్రాబ్దుల చరితకు ఆనవాళం!
జయహో తెలంగాణ వర్థిల్లు మాయమ్మ!
——-
అశ్మక జనపదం ఆదిగా మౌర్యులు
శాతవాహన, ఇక్ష్వాకు, చాళుక్య, చోడులు
కాకతీయ, బహమనీ, నిజాం నవాబులు
ఏలారు ఎందరో ఈ నేల సాక్షిగా!
గోదారి కృష్ణమ్మలు పరవళ్ళు తొక్కంగా
ఊపిర్లోసాయి ఈ నేలకు ఉప నదులెన్నో!
హిందూ ముస్లింల శతాబ్దాల సహవాసం
హిందుస్థానీ తెహజీబ్ కి సోపానం!
బతుకమ్మ, బోనాలు, దసరాల సరదాలు
సమ్మక్క జాతరలు, పీర్ల పండుగలు!
సర్వ పిండి, సకినాలు, దమ్మున్న బిర్యానీ
తెలంగాణ రుచులెన్నో జిహ్వ చాపల్యానికి!
యాదాద్రి నరసన్న, భద్రాద్రి రామన్న
వెములాడ రాజన్న వెలిసింది ఈడనే
అలంపూర్ జోగులాంబ అలుపెరుగని శక్తి
బాసటగా జ్ఞానమిచ్చు బాసర సరస్వతి!
పోరాటాల గడ్డలో ప్రతి పోరడు నిప్పు కణికే
సమరమందే కాదు సాహిత్యమున ముందే
పోతన, గోపన్న, పాల్కుర్తి సోమన్న
కాళోజీ, దాశరథులను కన్నదీ నేల!
జయహో తెలంగాణ వర్థిల్లు మాయమ్మ!
——-
పల్లె పల్లెనా చెరువులు ఉండే
పూడిక తీయగ పురుడు పోసుకునే!
ఎత్తిపోతల పథకాలు వచ్చే
ఎగువ నేలల దాహం తీరే!
చుక్క నీటికై చెమటోడ్చిన గతం
చక్కని పైరుపంటల పల్లెలు ప్రస్తుతం!
——-
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి