కష్టజీవుల కడగండ్లు

 

ధరలు ఆకాశాన దరిద్రము పక్కన

పేదోడి ఆకలి కేక పిడికెడన్నము లేక

ఆత్మ విమర్శన ఆజాదీకా అమృతోత్సవాన

——-

వందేభారత రైలు ఉరకలేస్తున్నది

వందలో యాభైకి పూట గడవకున్నది!

బడాయి కోసం లక్షల కోట్ల బుల్లెట్ రైళ్లు

బాగు పడని బడుగు వర్గ బ్రతుకులు!

పట్టాలపై గాలి మోటరు గమ్మతు

పట్టదెవరికీ పేదవాడి అవస్థలు

——-


ధరలు పెరుగుతుండే సంపద కరుగుతుండే

మధ్య తరగతి మాయమైపోతుండే

ఉన్నోని పైస పిల్లలెడుతుండే

లేనోని గోస లెక్కెవరికుండే?

——-

 బడ్జెట్ చూసినా ఏమున్నది అందులో

అంకెల గారడీలలో ఆరితేరే అందరూ!

కార్పొరేట్ల కాసులు కండ్ల ముందుండగా

కనిపించకుండెను కష్టజీవుల కడగండ్లు!

——-

కోసుకునే కత్తి గీసుకునే బ్లేడ్

రాసుకునే ఇంకు రాసిచ్చే చెక్కు

వేసుకునే చెప్పు మోసుకెళ్ళే శప పేటిక 

పసివాడి పాలు పెన్సిల్ షార్ప్నరు

కనపడెను ప్రభుత్వానికి ఖజానా నింపుకొను

——

అభివృద్ధి అన్నారని అధికారమందిస్తే

ఆర్ధిక నేరగాళ్ళు అవినీతి అమాత్యులు

తోడు దొంగలై దోచేసే దేశాన్ని

అసమర్థ పాలనలో అడ్డగోలు పన్నులు

వేతన జీవి వీపుపై వాటమైన వాతలు

——

రాకాసి కరోనా రాజేసిన చిచ్చుతో

బడుగు జీవి బ్రతుకు భారమైపోయే!

ఎవరి కంచంలో ఏమి వడ్డించునోయని

ఆకలిగొన్న బిడ్డలు అమ్మ వైపు చూసే!

అమృత కాలం కోసం ఆగమని చెప్పి 

మాటల పాయసాన్ని మంచిగా వడ్డించె!

——-

పైస పైస కూడబెట్టి పన్ను కట్టే జీతగాడు

లక్ష అప్పు అడిగితే సవాలక్ష ప్రశ్నలు!

కార్పోరేటు కేటుగాళ్ళ కనికట్టు మాయకు

పది లక్షల కోట్ల రుణం పలహారమైపోయే

———


తరుగుతున్న రూపాయి విలువ

పెరుగుతున్న వస్తువుల ధర

పరిగెత్తిస్తుండె సామాన్యుడిని

పది పైసల సంపాదనకై

పొద్దూమాపూ తేడా లేకుండా

అలుపెరుగని ఆదిత్యుడే

ఔరా అనుకుంటుండగా!

——-

వేయి పదహారులు వడ్డించకుంటే

గుమ్మాన్ని తొక్కనన్నది గ్యాసు బండ!

ఒళ్ళు పాడవును వండుకుని తింటే

పచ్చి వాటినే పలహారం చేస్తే పోలే!

——

పెరిగిన అభివృద్దిలో చోటు 

పేదోడిక లేకపోయే 

కొందరింట మరి 

కూడూ గుడ్డా కరువైపోయే!


ఆర్ధిక అసమానతలు 

అలుపెరుగక పెరిగిపోయే

ఆకాశ హర్మ్యాల నగరిలో 

పూరిళ్లూ ఉండిపోయే!


ఎవరో ఏదో చేస్తారన్న ఆశలు 

ఎండమావులైపోయే

బలిసిన ధనరాజుల మధ్య 

బక్క బీదోడు ఓడిపోయే!

——

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రాజకీయాలు

మన హైదరాబాదు